స్వాన్ ఇండియా, మే 31, (ఆంధ్రప్రభ): శ్రీ చౌడేశ్వరి తొగటవీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో తొగటవీర క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంఘం 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రామేశ్వరంలోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఐఐఐటీ తదితర కోర్సుల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద్యాల డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ప్రొద్దుటూరు టూటౌన్ సీఐ వంశీనాథ్, జమ్మలమడుగు సీఐ నరేష్ బాబు, డాక్టర్ తేజ విద్యార్థులను అభినందించారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, విద్యార్థులు లక్ష్యసాధన దిశగా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ కూడా అవసరమని పేర్కొన్నారు.
విశిష్ట అతిథులుగా హాజరైన పల్లా శేషయ్య, బండారు రఘు రామయ్య మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బలమైన పునాది వేయవచ్చని అన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తొగటవీర క్షత్రియ విద్యార్థులు ఎవరైనా చదువును మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడితే తమను సంప్రదించాలని కోరారు. విద్యను కొనసాగించేం దుకు తమ వంతు సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. విద్యకు పేదరికం అడ్డు కాదని, చదువుకో వాలనే సంకల్పం ఉంటే సమాజం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన వారికి విద్యా సహాయం అందించడం కూడా సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.
ఫోటో పిడిటిఆర్ 6 తొగట వీర క్షత్రియ విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్న సంఘ ప్రతినిధులు